జూన్ 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమం: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, జూన్ 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

 

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలతో పాటు బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. “గత ఏడాది రాష్ట్రంలో పచ్చదనం 29 శాతం ఉండగా, ఈ ఏడాది అది 30.5 శాతానికి పెరిగింది. ఇది హర్షణీయం,” అని ముఖ్యమంత్రి అన్నారు.

 

రాష్ట్రంలో ఉద్యానవనాల సాగు, అటవీ ప్రాంత విస్తరణతో కలిపి 2033 నాటికి పచ్చదనాన్ని 37 శాతానికి, 2047 నాటికి 50 శాతానికి చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతి ఏటా కనీసం 1.5 శాతం మేర పచ్చదనం పెరిగేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలని, అప్పుడే రాష్ట్రం ఆహ్లాదకరంగా పచ్చదనంతో కళకళలాడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

సీఆర్డీఏ పరిధిలోని అటవీ ప్రాంతంతో సహా మొత్తం పచ్చదనంపై శాటిలైట్ల సహాయంతో స్పష్టమైన సమాచారం సేకరించాలని, నాటిన ప్రతీ మొక్కకూ జియో ట్యాగింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు, అవసరమైతే సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం తీసుకునేలా ఒక విధానాన్ని రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా అమరావతి పరిధిలోని అన్ని రిజర్వ్ అటవీ ప్రాంతాలను జపాన్ మియావకీ పద్ధతిలో అభివృద్ధి చేసి, రాబోయే మూడేళ్లలో స్పష్టమైన ఫలితాలు కనిపించాలని చంద్రబాబు అధికారులకు తెలిపారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రాన్ని హరిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *