కొత్త పార్టీ వార్తలపై తీవ్రంగా స్పందించిన కవిత..! ఏమన్నారంటే..?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ఈ ఊహాగానాల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, ఒక దినపత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్‌ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. “కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా?? శాడిజమా?” అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం కవిత చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

 

కొంతకాలంగా తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు. జాగృతికి అనుబంధ సంఘాలను వరుసగా ప్రకటించడం, సంస్థ కార్యకలాపాలను విస్తరించడం వంటి పరిణామాలతో ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

 

వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం పార్టీ అధ్యక్షుడు, తన తండ్రి కేసీఆర్‌కు ఆమె ఒక లేఖ రాయడం, ఆ తర్వాత అమెరికా పర్యటనకు వెళ్ళే ముందు జాగృతి అనుబంధ సంఘాల బాధ్యులను ప్రకటించడం వంటివి ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి.

 

సామాజిక మాధ్యమాల్లో అయితే ఏకంగా పార్టీ పేరు కూడా ఖరారైందని, కేసీఆర్ పంపిన దూతలతో కవిత జరిపిన మంతనాలు విఫలమయ్యాయని కథనాలు వెలువడ్డాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన కవిత తన కొత్త పార్టీని ప్రకటిస్తారంటూ విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ కథనాలన్నింటినీ కవిత ఖండించారు. తనను సంప్రదించకుండా అవాస్తవాలు ప్రచురించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *