మీ ఆటలు ఇక సాగవు: చంద్రబాబు..

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో జరుగుతున్న మహానాడు రెండవ రోజు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పల్నాడు, ప్రకాశం జిల్లాలలో జరిగిన తెలుగుదేశం పార్టీ నేతల హత్యలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఈ హత్యలపై తనకు అనుమానం వచ్చిందని ఆయన అన్నారు. తాను ఇప్పుడు ఎవరినీ నమ్మడం లేదని స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని మనసులో అనుమానంతో ఆలోచిస్తే, కొందరు మన దగ్గరే ఉంటూ వారికి కోవర్టులుగా పనిచేస్తూ, వారి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్య రాజకీయాలు చేస్తున్నారని అర్ధమయిందన్నారు.

 

మన చేతితో, మన వేలితో మన కన్ను పొడుచుకునేలా చేయడం ద్వారా రెండు పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో వీళ్లే ఒకరినొకరు చంపుకుంటున్నారని చెడ్డ పేరు తేవడం, వారి లక్ష్యాలను సులభంగా తొలగించడం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నేరస్తులు చేసే మాయ అని చెబుతూ, నేరస్తులు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని, తన దగ్గర వారి ఆటలు సాగనివ్వనని హెచ్చరించారు.

 

కోవర్టులను మన దగ్గరికి పంపి, వారి ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవాలనుకుంటే అది సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీలోకి వలస పక్షులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడని చంద్రబాబు నాయుడు అన్నారు. కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *