పల్నాడు డబుల్ మర్డర్ కేసు.. పరారీలో పిన్నెల్లి బ్రదర్స్..

వైసీపీకి అధికారం పోయిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్‌కు కష్టాలు రెట్టింపు అయ్యాయి. పల్నాడులో జరిగిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య కేసులో పిన్నెల్లి సోదరులు బుక్కయ్యారు. వారిద్దరిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారిద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

పల్నాడు పేరు చెప్పగానే ఇప్పుడు గుర్తుకొచ్చే పేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఎన్నికల్లో ఈవీఎంలు బద్దలు కొట్టిన కేసులో అరెస్టయిన ఆయన, అంతగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులు జైలుకి వెళ్లారు.. ఆపై విడుదలయ్యారు. అధికారం లేకపోవడంతో పిన్నెల్లి సైలెంట్‌ అయ్యారనే వాదన పైకి వినబడేది. లోపల మాత్రం రివేంజ్ ఏ మాత్రం తగ్గలేదు.

 

తాజాగా ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్యలో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి‌పై కేసు నమోదైంది. ఇద్దరు బ్రదర్స్‌ని ఏ-6, 7 గా చేర్చారు పోలీసులు. హత్యలు జరిగిన ముందు రోజు వరకు మాచర్లలో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

 

ఆ మరుసటి రోజు హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. ఈ సోదరుల కోసం గాలింపు చేపట్టారు. ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్టు చేస్తారన్న వార్తలతో రేపో మాపో న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

 

అసలేం జరిగింది?

 

పల్నాడు జిల్లాలో గుండ్లపాడుకి చెందిన టీడీపీ కార్యకర్తలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు కోటేశ్వరరావు శనివారం తెలంగాణలో శుభకార్యానికి వెళ్లారు. అక్కడ ఫంక్షన్ తర్వాత తిరిగి వస్తున్నారు. అయితే బోదిలవీడు-మండాది గ్రామాల మధ్య వీరి టూ వీలర్స్‌ను స్కార్పియో వాహనం ఢీ కొట్టింది. ఇంకా వీరు బతికి వున్నారని భావించి రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు.

 

ఘటన తర్వాత స్కార్పియోను అక్కడే వదిలేసిన నిందితులు పారిపోయారు. నిందితులను తాను చూశానని వెంకటేశ్వర్లు అల్లుడు ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెనుక పిన్నెల్లి ప్రమేయం ఉందంటూ ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ-6, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఏ-7గా కేసు నమోదుచేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శనివారం నియోజకవర్గాన్ని గాలింపు చేపట్టారు. హత్యలు జరిగిన కొద్ది గంటలకే పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

 

ఈవీఎంలు కేసు తర్వాత వెంకట్రామిరెడ్డి పత్తా లేకుండా పోయారు. అజ్ఞాతంలో ఉండి ఈ కేసులకు బెయిల్‌ తెచ్చుకున్నాడు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు, దాడులు హత్యాయత్నాలు, హత్యలు 12 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *