కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు నిలకడగా వెలుగులోకి వస్తాయి..: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు నిలకడగా వెలుగులోకి వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాళేశ్వరంపై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు.

 

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక బ్యారేజీలో రెండు చోట్ల పగుళ్లు కనిపిస్తే, ఏదో పెను ప్రమాదం జరిగిపోయినట్లుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఘోష్ కమిటీ విచారణ పూర్తయిందని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా నోటీసులు జారీ చేయడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహంలో భాగమేనని అభిప్రాయపడ్డారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఒక అపరిచితుడిలా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదని ఒకవైపు ‘రెమో’లా చెబుతారు… మరోవైపు రూ. లక్షా 60 వేల కోట్ల రూపాయల అప్పు చేశామని ‘రామం’లా చెబుతారు అని ఎద్దేవా చేశారు. ఇదివరకే ఇచ్చిన హామీలకే దిక్కులేని పరిస్థితుల్లో, ఇప్పుడు కొత్తగా నల్లమల డిక్లరేషన్ ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన నిలదీశారు.

 

గత నెల రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు ప్రపంచ సుందరీమణులు, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం వంటి అంశాల చుట్టే తిరుగుతున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాము నిర్మించిన కట్టడాల ముందే ఈ ప్రపంచ సుందరీమణులు ఫొటోలు దిగుతున్నారని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *