హైదరాబాద్‌కు కేంద్రం గుడ్ న్యూస్: 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు..

హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పర్యావరణ హితమైన ప్రజారవాణాను ప్రోత్సహించే దిశగా చేపట్టిన పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద నగరానికి 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు, కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడనుంది.

 

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించారు. పథకం ప్రస్తుత దశలో బెంగళూరుకు సుమారు 4,500, ఢిల్లీకి 2,800, అహ్మదాబాద్‌కు 1,000, సూరత్‌కు 600 బస్సులతో పాటు హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులను అందజేయనున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

 

ఈ సందర్భంగా మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఇప్పుడు సుస్థిర పట్టణ రవాణా దిశగా దృఢమైన అడుగులు వేస్తోంది. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు, నగరాలు ప్రజారవాణాను మరింత పరిశుభ్రంగా, సమర్థవంతంగా మార్చేందుకు ఎలక్ట్రిక్ బస్సులను చురుకుగా స్వీకరిస్తున్నాయి,” అని తెలిపారు. “మేము కేవలం ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించడమే కాకుండా, నూతన ఆవిష్కరణలు మరియు పర్యావరణ స్పృహతో భారతదేశ రవాణా వ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాం” అని ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పీఎం ఈ-డ్రైవ్ హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని కుమారస్వామి పేర్కొన్నారు.

 

పీఎం ఈ-డ్రైవ్ కార్యక్రమం ద్వారా ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2026 వరకు రెండేళ్ల కాలంలో రూ.10,900 కోట్ల మొత్తం ఆర్థిక వ్యయంతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ ప్రయత్నాలలో ఒకటిగా నిలుస్తుందని, సకాలంలో బస్సుల పంపిణీ, కార్యాచరణ సంసిద్ధత, మరియు భాగస్వామ్య రాష్ట్రాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

 

ఈ పథకం కింద డిమాండ్ ఇన్సెంటివ్‌ను పొందేందుకు ఈవీ కొనుగోలుదారులకు ఈ-వోచర్లను కూడా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా, పీఎం ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా ఈ-ఆంబులెన్స్‌లు, ఈ-ట్రక్కుల కోసం కూడా చెరో రూ.500 కోట్లు కేటాయించారు. రోగుల సౌకర్యవంతమైన రవాణా కోసం ఈ-అంబులెన్స్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ఉద్దేశ్యం. అదేవిధంగా, వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న ట్రక్కుల స్థానంలో ఈ-ట్రక్కులను కూడా పథకంలో చేర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *