మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్.. !

కొండ సురేఖ. పెద్ద నోరున్న నేత. ఎవరికీ భయపడే టైప్ కాదామె. ఉన్నదున్నట్టు మాట్లాడుతారు. ఆఫ్ ది రికార్డ్ మాట్లాడాల్సింది కూడా పబ్లిక్‌గా మాట్లాడేస్తుంటారు. అస్సలు లౌక్యం తెలీని నేత. ఫైర్ బ్రాండ్ లీడర్. అదే ఆమెను తరుచూ ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. ప్రతిపక్షాలకు, ట్రోలర్స్‌కు అనవసరంగా ఛాన్స్ ఇస్తుంటుంది. అయితే, ఈసారి మాత్రం అలాకాదు. మేటర్ వెరీ సీరియస్. కొండా సురేఖ అన్నది ఒకటి. వైరల్ చేస్తున్న వీడియో మరొకటి. కావాల్సిన చోట ఎడిట్ చేసి.. కంపు కంపు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా వారియర్స్. గత ప్రభుత్వ హయాంలో మంత్రులు కమీషన్లు తీసుకుని ఫైల్స్ మీద సంతకాలు పెట్టేవారని.. తాను అలా చేయట్లేదనేది కొండా సురేఖ కామెంట్. కానీ, ఆ మాటలను అటూఇటూ ఆగమాగం చేసి.. కొందరు మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారనే అర్థం వచ్చేలా కొండా ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రచారం సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.

 

విచారణకు కేటీఆర్ డిమాండ్

 

దొరికిందే ఛాన్స్ అన్నట్టు.. మాజీ మంత్రి కేటీఆర్ సైతం రంగంలోకి దిగిపోయారు. నిజాలు మాట్లాడినందుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. కమీషన్ తీసుకుంటున్న మంత్రుల పేర్లను కొండా సురేఖ ప్రకటించాలన్నారు. తెలంగాణలో కమీషన్ సర్కార్ నడుపుతోందని ఆరోపించారు. మంత్రి ఆరోపణలపై రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలు విచారణకు ఆదేశిస్తారా? అని ప్రశ్నించారు కేటీఆర్.

 

ఓర్వలేకే.. కొండా ఫైర్

 

అసలే శివంగి. తనపై ఈ రేంజ్‌లో అటాక్ జరుగుతుంటే ఊరుకుంటారా? బీఆర్ఎస్ నేతలకు, సోషల్ మీడియా ముసుగు దొంగలకు.. మాస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. కుట్రలో భాగంగానే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తనను ట్రోల్ చేస్తున్న వారిపై లీగల్‌గా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయడానికైనా మంత్రులు పైసలు తీసుకునేవారని తాను అన్నానని.. ఆ మాటలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. తమ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు పెయిడ్ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. తాను మాట్లాడిన వీడియోలో ముందు వెనక కొంత తీసేసి, ఎడిటింగ్ చేసిన మార్ఫింగ్ వీడియోను సర్క్యూలేట్ చేస్తున్నారని చెప్పారు. తమ కేబినెట్ సభ్యుల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. వారి ఆశలు నెరవేరవని ఫైర్ అయ్యారు కొండా సురేఖ. ఇలాంటి దుష్ప్రచారాలు ఇంకోసారి చేస్తే ఎంత మాత్రం సహించేదిలేదని.. ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.

 

విషపురుగు బీఆర్ఎస్..

 

బీఆర్ఎస్ హయంలో మంత్రిగా పని చేసిన నాయిని నరసింహారెడ్డి.. మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అని అంటూ ఆనాటి అవినీతిని బయట పెట్టింది గుర్తులేదా? అని నిలదీశారు కొండా. దళిత బంధులో ప్రతి ఎమ్మెల్యే 30% కమీషన్ తీసుకుంటారని అప్పటి సీఎం కేసీఆరే చెప్పడాన్ని మరిచారా? అని ప్రశ్నించారు. ఊర్ల మీద పడి ప్రజల రక్తాన్ని పీల్చారు కాబట్టే ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెప్పారని.. అయినా వాళ్ల బుద్ధి మారలేదని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే అవినీతికి, అబద్ధాలకు పుట్టిన విషపురుగు బీఆర్ఎ‌స్‌ను ప్రజలే నామరూపాలు లేకుండా నలిపేస్తారని హెచ్చరించారు మంత్రి కొండా సురేఖ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *