పుల్వామాలో కాల్పుల .. ఒక టెర్రరిస్ట్ ఖతం..!

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా పరిధిలోని నాదేర్ త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా సమాచారం భద్రతా దళాలకు అందింది. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు గురువారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నిర్బంధ తనిఖీ ఆపరేషన్ (కార్డన్ సెర్చ్) ప్రారంభించాయి.

 

తనిఖీలు జరుగుతున్న క్రమంలో ఒకచోట దాక్కున్న ఉగ్రవాదులు ఒక్కసారిగా భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ప్రతిగా కాల్పులు జరిపాయి. ఇరువర్గాల మధ్య కొంతసేపు భీకరంగా కాల్పులు కొనసాగాయి. ఈ క్రమంలో భద్రతా దళాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. మరో ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు చిక్కినట్టు తెలిసింది.

 

ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎంతమంది ఉగ్రవాదులున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. స్థానికులను అప్రమత్తం చేసి, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *