PoKలో ఎమర్జెన్సీ విధింపు.. వణికిపోతున్న పాకిస్థాన్..,!

జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రఘటన తర్వాత భారత్- పాకిస్థాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని యావత్ భారతావని కసిగా రగిలిపోతోంది. ఇక భారత్- పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధం ఏ క్షణం ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ ఎప్పుడు.. ఎలా.. ఎక్కడ దాడి చేస్తుందోనని కంటిమీద కునుకు లేకుండా పాకిస్థాన్ భయంతో ఉంది.

 

ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న 13 నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు ఆహార సామాగ్రిని నిల్వ చేసుకోవాలని సూచనలు జారీ చేసినట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK) ప్రధాన మంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ ఓ ప్రకటనలో తెలిపినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్త హల్ చల్ అవుతోంది. ఈ 13 నియోజకవర్గాల అత్యవసర పరిస్థితి కోసం ఒక బిలియన్ రూపాయలు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పాక్ ఆక్రమిత కశ్మీర్‌(PoK)లో 1000కిపైగా మదర్సాలు ఖాళీ చేయించారు. పీఓకే సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్లు సిద్ధం చేసుకుంటున్నారు.

 

మరోవైపు ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌(POK)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను పాకిస్థాన్ ఆర్మీ ఖాళీ చేయిస్తోంది. అక్కడ ఉన్న ఉగ్రవాదులను బంకర్లు, ఆర్మీ షెల్టర్లలోకి హుటాహుటిన తరలిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ యుద్ధం రావచ్చనే ఊహాగానాలతో పీఓకేలోని ఉగ్రవాదులను ఎలాగైనా కాపాడుకునేందుకు పాకిస్థాన్ ఆర్మీ ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇక పాకిస్థాన్- భారత్ సరిహద్దు వెంబడి 29 నగరాల్లో పాకిస్థాన్ యుద్ధ సైరన్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. యుద్ధ సైరన్ మోగితే అక్కడి ప్రజలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎలా వ్యవహరించాలో అధికారుల ద్వారా సూచనలు చేసినట్లు సమాచారం.

 

ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

 

ఇప్పటికే కఠినమైన చర్యల్లో భాగంగా పాకిస్థాన్ ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది భారత ప్రభుత్వం. సింధూ జలాల రద్దుతోపాటు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *