పాకిస్థాన్‌కు మరో షాక్.. పాక్ ఎయిర్‌క్రాఫ్ట్ నావిగేషన్ వ్యవస్థను నిరోధించేందుకు జామర్లను మోహరించిన భారత్..

పాకిస్థాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జీఎన్‌ఎస్‌ఎస్) సిగ్నల్‌లకు అంతరాయం కలిగించేందుకు భారతదేశం తన పశ్చిమ సరిహద్దులో అధునాతన జామింగ్ వ్యవస్థను మోహరించింది. ఈ చర్యతో పాకిస్థాన్ మిలిటరీ విమానాల నావిగేషన్ సామర్థ్యం, దాడి సామర్థ్యం గణనీయంగా తగ్గే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ముందు ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు పాక్‌కు చెందిన కమర్షియల్, మిలటరీ విమానాలు సహా అన్నింటికీ భారత్ తన గగనతలాన్ని మూసివేసింది.

 

భారత్ జామింగ్ వ్యవస్థలు అమెరికాకు చెందిన జీపీఎస్, రష్యా యొక్క గ్లోనాస్, చైనాకు చెందిన బైడు వంటి పలు శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థలపై ప్రభావం చూపగలవని సమాచారం. పాకిస్థాన్ మిలిటరీ విమానాలు వీటినే ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడివి పనిచేయకపోతే వారి లక్ష్య నిర్ధారణ, దిశా గమనాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన ఘటన అనంతరం పాక్‌‌పై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు తన గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ‘నోటం’ (నోటీస్ టు ఎయిర్‌మెన్) ఆదేశాలు జారీచేసింది.

 

ఈ ఆదేశాల ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన చార్టర్డ్, లీజ్డ్, కమర్షియల్, మిలిటరీ విమానాలు భారత గగన తలాన్ని ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే, ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి ముందే పాకిస్థాన్ విమానయాన సంస్థలు తమ మార్గాలను మార్చుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇకపై పాకిస్థాన్ విమానాలు మలేసియా వంటి ఆగ్నేయ ఆసియా దేశాలకు చేరుకునేందుకు చైనా లేదా శ్రీలంక గగనతలం మీదుగా సుదీర్ఘంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది ఆ దేశ విమానాలకు అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో వాటిపై తీవ్రమైన ఒత్తిడి పడే అవకాశం ఉంది.

 

పీఐఏకు తడిసిమోపెడు

భారత్ నిర్ణయంతో 32 విమానాలు కలిగిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఆగ్నేయాసియా, సుదూర తీర్పు ప్రాంతాలకు వెళ్లే విమానాలు ఇప్పుడు ఒకటి రెండు గంటల పాటు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఇంధన ఖర్చు పెరుగుతుంది. సిబ్బంది డ్యూటీ గంటలు పెరుగుతాయి. షెడ్యూల్‌లో మార్పులు లేదా ఫ్లైట్ ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశముంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ పాకిస్థాన్ పౌరుల వీసాలను కూడా రద్దు చేసింది. భారత్ తదుపరి తీసుకునే చర్యలపై పాకిస్థాన్ అప్రమత్తంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *