షర్మిలపై కోడిగుడ్లతో దాడి.. విజయవాడలో హైటెన్షన్..

బెజవాడలో హైటెన్షన్. ఆంధ్రరత్నా భవన్‌లో అలజడి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల టార్గెట్‌గా కోడిగుడ్లు, టమోటాలు విసిరారు బీజేపీ కార్యకర్తులు. షర్మిల మీదకు ట్యూబ్‌లైట్ కూడా విసిరారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గంట పాటు తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.

ఉదయం నుంచే హైటెన్షన్

ఏపీ రాజధాని అమరావతి పున:ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు. ఆయన రాకకు నిరసనగా కాంగ్రెస్ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టారు పార్టీ చీఫ్ షర్మిల. ఉద్దండరాయపాలెం వెళ్లి ధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే, షర్మిలను ఉదయమే హౌజ్ అరెస్ట్ చేసి.. బయటకు రాకుండా కట్టడి చేశారు పోలీసులు. మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన షర్మిల.. ప్రెస్‌మీట్ పెట్టారు. సరిగ్గా అదే సమయంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆంధ్రరత్నా భవన్‌పై దాడి చేశారు. కోడిగుడ్లు, టమోటాలను కాంగ్రెస్ భవన్ మీదకు విసిరి నానాహంగామా చేశారు.

షర్మిలపై ట్యూబ్‌లైట్ 

దాడి గురించి తెలిసి వైఎస్ షర్మిల.. పార్టీ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. కార్యాలయ ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు. అదే సమయంలో పక్కనున్న బిల్డింగ్ నుంచి గుర్తి తెలియని వ్యక్తులు ట్యూబ్‌లైట్ విసిరారు. ఆ ట్యూబ్‌లైట్ షర్మిల సమీపంలో పడి పగిలిపోయింది.

పోలీసుల లాఠీఛార్జ్

బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కాషాయ శ్రేణులు కాంగ్రెస్ భవన్‌లోని దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గేటుకు అడ్డంగా నిలబడి కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఇరు వర్గాలపై లాఠీఛార్జ్ చేశారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

బీజేపీ నేతలదే బాధ్యత

తనపై దాడికి ప్రయత్నించిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుపై దాడికి తెగించిన బీజేపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జరిగిన దారుణంపై ఏపీ బీజేపీ నేతలే బాధ్యత తీసుకొవాలన్నారు వైఎస్ షర్మిల. తనపైనే దాడికి ప్రయత్నిస్తే.. రాష్ట్రంలో మహిళలకు ఇంకేం రక్షణ ఉంటుందని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *