కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల హింసాత్మక దాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఘటన వార్త విన్న దేశ ప్రజలు షాక్ కు గురయ్యారు. ఆందోళనకు గురవుతున్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలను కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అమాయక టూరిస్టులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 27 మంది అక్కడికక్కడే చనిపోవడం దేశ ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటికే రక్షణ దళాలు, కశ్మీర్ పోలీసులు, పారా మిలిటరీ దళాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల కదలికలపై పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దేశ ప్రజలు ఉగ్రవాదులపై ఫైరవుతున్నారు. వారిని ఎక్కడున్నా దొరకపట్టి కఠినంగా శిక్షంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రక్షణ దళాలను దేశ ప్రజలు కోరుతున్నారు.
అయితే పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి హై అలర్ట్స్ జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన హెచ్చరికలతో రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. రాష్ట్ర రాజధాని నగంరహైదరాబాద్‌లో ఎక్కడికక్కడా తనిఖీలు చేపట్టాలని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని పేర్కొంది. తెలంగాణతో సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు అన్నింటికీ కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మహా నగరంలోని సున్నిత ప్రాంతాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టారు. పాత బస్తీతో పాటు ఇతర ముఖ్య ప్రాంతాలపై పోలీసులు దృష్టి పెట్టారు. హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని గతంలో టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా పలు ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా పోలీస్ ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో కూడా సెక్యూరిటీని పెంచారు. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు.