చంద్రబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ..!

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు. అటు తెలంగాణ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ సైతం చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు, చంద్రబాబు హయాంలో హైదరాబాద్ కి ఐటీ కంపెనీలు వచ్చాయని, హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందన్నారు. కేసీఆర్, షర్మిల కూడా సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలపడం విశేషం. పార్టీ నేతలు, మిత్రపక్షాలు, అభిమానులు సరేసరి.. వైరి వర్గాలు కూడా ఈసారి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలపడం ఆసక్తిగా మారింది.

 

జగన్ నుంచి విషెస్..

మాజీ సీఎం జగన్ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఈసారి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపలేదు. పోనీ ఆయన కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెబుతారు, సోషల్ మీడియాని వాడుకోరు అనుకుంటే పొరపాటే. తల్లి విజయమ్మ పుట్టినరోజున ప్రతి ఏడాదీ ఆయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపేవారు. ఈ ఏడాది మాత్రతం ఆయన చెప్పలేదు. తల్లి పుట్టినరోజుని పట్టించుకోని జగన్, తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారని ఎవరూ అనుకోలేదు. కానీ విచిత్రంగా ఆయన చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ వేశారు. ఆయన ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ శుభాకాంక్షల ట్వీట్ కి టీడీపీ నుంచి మంచి స్పందన వస్తోంది. అదే సమయంలో వైసీపీ సానుభూతి పరులు మాత్రం జగన్ ట్వీట్ కి కౌంటర్లిస్తున్నారు. ‘విజయమ్మకు కూడా విషెస్ చెబితే పోయేదేముంది అన్నా’ అంటూ బదులిస్తున్నారు.

 

కేటీఆర్ పొగడ్తలు..

ఆమధ్య స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే కనీసం హైదరాబాద్ లో నిరసనలకు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులివ్వలేదు. పక్క రాష్ట్రం వ్యవహారాలు ఇక్కడెందుకంటూ కేటీఆర్ స్పందించారు. చంద్రబాబుపై అక్కసుని ప్రదర్శించారు. అయితే నేడు సీఎంగా ఉన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ తన సహజ వైఖరికి భిన్నంగా స్పందించడం విశేషం. ట్విట్టర్లో విషెస్ చెబుతూనే.. పార్టీ మీటింగ్ లో చంద్రబాబు గొప్పదనాన్ని మెచ్చుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందన్నారు. హైదరాబాద్ కి ఐటీ కంపెనీలు చంద్రబాబు తీసుకొచ్చారని వివరించారు. అభివృద్ధి విషయంలో ఎవరి ఆనవాళ్లు, ఇంకెవరూ చెరిపేయలేరని చెప్పుకొచ్చారు.

 

అటు కేసీఆర్ కూడా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని, ఆయన పాలనలో ఏపీ ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు కేసీఆర్.

 

ప్రధాని మోదీ నుంచి మొదలు పెడితే ఈరోజు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి పుట్టినరోజు కావడంతో మిత్రపక్షాల నేతలంతా సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన వారంతా ఈరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *