తన జీవితం ప్రజలకే అంకితమన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీ-4 కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. ఉగాది రోజు ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమవుతుందని.. అందుకే ఈ వినూత్న కార్యక్రామానికి ఇవాళ శ్రీకారం చుట్టామన్నారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్‌గా ఈ విధానం తీసుకొచ్చారు. మార్గదర్శి-బంగారు కుటుంబం నినాదంతో పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. అన్ని విషయాల్లోనూ తనకు ఆయనే స్ఫూర్తి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాము చేసిన అభివృద్ధి వల్ల తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం వస్తోంది. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలకు ఏయే మంచి పనులు చేయాలనే తాను ఆలోచిస్తానని చంద్రబాబు చెప్పారు.
ప్రతి కుటుంబానికి విజన్ డాక్యుమెంట్ తయారు చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. పీ-4 విధానంలో ప్రభుత్వం మెంటర్‌గా ఉంటుందన్నారు. ప్రతి ఇంటికీ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సమాజం ఇచ్చినదాన్ని తిరిగివ్వాల్సిన అవసరం ఉందన్నారు. పీ-4 విధానం సమాజంలో గేమ్ ఛేంజర్ అవుతుందని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ కావాలని అని చంద్రబాబు ఆకాంక్షించారు.
పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్‌గా ఈ విధానం తీసుకొచ్చారు. మార్గదర్శి-బంగారు కుటుంబం నినాదంతో పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయెల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు.
చంద్రబాబుకు అందుకే మద్దతిచ్చా: పవన్ కళ్యాణ్
మరోవైపు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు బాగుండాలనేదే సీఎం చంద్రబాబు, తన ఆకాంక్ష అని తెలిపారు. సమర్థ నాయకుడు కాబట్టే చంద్రబాబుకు మద్దతిచ్చినట్లు ఆయన చెప్పారు. ఆయన సీఎం అయ్యాక కార్మికుల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. చంద్రబాబు సారథ్యంలో మన రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో కొనసాగుతోందన్నారు.