రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి ప్రజలపై భారాన్ని మోపనుంది. ఇప్పటికే ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత లావాదేవీలను నెలకు ఐదు నుంచి మూడుకు తగ్గించారు. ఈ నిబంధన మెట్రో నగరాలైన ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో అమలు అవుతోంది. ఇతర ప్రాంతాల్లో మాత్రం ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. నెలలో ఈ పరిమితి దాటితే ఇంటర్ ఛేంజ్ రుసుములు వర్తిస్తాయని తెలిసిందే.
కానీ ఇప్పుడు అనూహ్యంగా నగదు ఉపసంహరణపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచింది ఆర్బీఐ. వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల అభ్యర్థన మేరకు ఈ ఫీజుల్ని సవరించింది. ఇప్పటి వరకు ఆర్థిక లావాదేవీలపై రూ. 17.. ఆర్థికేతర లావాదేవీలపై రూ. 6 చొప్పున వసూలు చేశారు. కానీ మే 1 నుంచి ఆర్థిక లావాదేవీలపై రూ. 19.. ఆర్థికేతర లావాదేవీలపై రూ. 7 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. తరచుగా ఏటీఎంలు ఉపయోగించే వినియోగదారులపై ఈ ఎఫెక్ట్ పడనుంది.
ఆర్ధిక లావాదేవీలు, ఆర్ధికేతర లావాదేవీలు..?
ఆర్థిక లావాదేవీలు అంటే డబ్బుతో కూడుకున్నవి. నగదు విత్‌డ్రా చేయడం దీని క్రిందకు వస్తుంది. ఆర్థికేతర లావాదేవీలు అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటివి ఉంటాయి.
ఇంటర్‌ఛేంజ్ ఫీజు..
ఒక బ్యాంకు కస్టమర్లకు ఏటీఎం సేవలను అందించినందుకు మరొక బ్యాంకుకు చెల్లించే ఛార్జీనే ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజు అంటారు. ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత బ్యాంకులు ఈ చార్జీలను వసూలు చేస్తాయి. ఉదాహరణకు ఇక్కడ మీరు ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ అయితే.. మీ ఉచిత ట్రాన్ సాక్షన్స్ పరిమితి అయిపోయి లేదా వేరే బ్యాంక్ ఏటీఎం సేవలను వినియోగిస్తే ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేయబడుతోంది. అన్ని బ్యాంకులకు కూడా నియమం వర్తిస్తుందడగా.. ఈ కొత్త రూల్ తో చిన్న బ్యాంకుల కస్టమర్లపై ఎక్కువ భారం పడుతుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.