తెలంగాణా రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్స్ దడ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ స్వైర విహారం చేస్తున్నారు. మారణాయుధాలతో తిరుగుతూ ఆర్ధరాత్రి దోపిడీకి పాల్పడుతున్నారు . నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకొని చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు ప్రయత్నిస్తోందని ఇప్పుడు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ నేపధ్యంలో పోలీసులు సూచిస్తున్నారు .
ఓరుగల్లులో చెడ్డీ గ్యాంగ్స్ కలకలం
ఇంతకు ముందు హైదరాబాద్ లో మాత్రమే కనిపించిన చెడ్డీగ్యాంగ్స్ , ఇప్పుడు హన్మకొండ, వరంగల్ లలో కూడా కనిపించటం కలకలం రేపుతుంది. వారు చోరీలకు పాల్పడుతున్న క్రమంలో ఓరుగల్లు వాసుల్లో ఈ గ్యాంగ్ పై భయం పట్టుకుంది. చెడ్డీలు,తలపాగాలు ధరించి, మారణాయుధాలను చేత్తో పట్టుకొని, అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత పది మంది గ్యాంగ్ తో ఈ గ్యాంగ్లు దోపిడీకి తెగబడుతున్నారు.
పక్కా రెక్కీతో చెడ్డీ గ్యాంగ్ చోరీలు
వీరు దోపిడీ చేసే సమయంలో అడ్డొస్తే ప్రాణాలు తీయడానికి అయినా వెనుకాడరు. ఎలాంటి ఇంటి తాళం అయినా సరే ఒకే ఒక రాడ్డుతో చాకచక్యంగా తెరవగల టెక్నిక్ చెడ్డీ గ్యాంగ్ సొంతం. అంతేకాదు ఎక్కడైనా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, పక్కాగా రెక్కీ వేసి మరీ చోరీలకు పాల్పడతారు. కనీసం 10 మంది సభ్యులు ఉండే ఈ గ్యాంగ్ లు సిసి టివి ఫుటేజ్ లో మాత్రమే కనిపించి, పట్టుబడకుండా తప్పించుకుంటారు.
హన్మకొండలో ఒక వ్యక్తి ఇంట్లో చోరీ… సీసీ టీవీ కెమెరాలలో రికార్డ్
తప్పించుకునే వ్యూహాన్ని కూడా ముందే సిద్ధం చేసుకొని దొంగతనాలకు దిగుతారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలలో ఉన్న ఇళ్లనే దోపిడీకి ఎంచుకుంటారు. ఇక తాజాగా హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న బత్తిని వెంకటనారాయణ అనే వ్యక్తి ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చొరబడి 500 గ్రాముల రెండు వెండి నాణేలు ఎత్తుకెళ్లడంతో పాటు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.