ఏపీ బ్రాండ్ అరకు కాఫీ ఘుమఘుమలు ఇకపై పార్లమెంట్ లోనూ ఎంపీలకు ఆహ్లాదాన్ని పంచబోతున్నాయి. అరకు లోయలో పండే కాఫీ రుచిని పార్లమెంట్ లో ఎంపీలకు పరిచయం చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న ఏపీ ఎంపీల వినతిని లోక్ సభ స్పీకర్ తాజాగా అనుమతించారు. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో ఇవాళ రెండు స్టాల్స్ ను ప్రారంభించారు. కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్ తో పాటు ఏపీకి చెందిన ఎంపీలు, రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్లమెంట్‌లో ఇవాళ రెండు అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. అలాగే రాజ్యసభ క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్ ను వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. అరకు లోయలో కాఫీ సువాసన పార్లమెంట్ లో గుబాళించబోతోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
మన గిరిజన సంపద అరకు కాఫీని ప్రచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కాఫీ స్టాళ్లను గర్వంగా ప్రారంభించారని, ఇప్పుడు, మన పార్లమెంటేరియన్లు మన స్థానిక ప్రజల సాధికారత, స్థిరమైన వ్యవసాయాన్ని సూచించే ఈ స్థానిక పానీయం రుచి చూడవచ్చని ఆయన తెలిపారు. ఇది బ్రాండ్ భారత్‌కు పెద్ద ప్రోత్సాహం అన్నారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు.
పార్లమెంట్‌లో కాఫీ ప్రియులకు శుభవార్త! మీరు ఇప్పుడు ఆవరణలోనే తాజాగా తయారుచేసిన అరకు కాఫీ కప్పును ఆస్వాదించవచ్చని చంద్రబాబు తెలిపారు. ‘మన్ కీ బాత్’లో అరకు కాఫీని ప్రోత్సహించినందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, ఈ స్టాల్‌ను ఏర్పాటు చేయడానికి దయతో అనుమతి ఇచ్చినందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ మైలురాయిని నిజం చేసిన ప్రతి ఒక్కరికీ, అంకితభావంతో ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇది మనందరికీ, ముఖ్యంగా మన గిరిజన రైతులకు గర్వకారణం, వారి అంకితభావం మరియు కృషి అరకు కాఫీని జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయికి తీసుకువచ్చింది. మనం ప్రతి కప్పును ఆస్వాదిస్తున్నప్పుడు, వారి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని కూడా గుర్తుంచుకుందాం అన్నారు.