ఆ జడ్జి గారి తీర్పులన్నీ రివ్యూ చేయాలి.. సుప్రీం కోర్టులో జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో పిల్..

తన నివాసంలో భారీ నగదు లభించడంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించింది. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్రం ఆమోదించినట్లయితే, యశ్వంత్ వర్మ త్వరలో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అవుతారు.

 

ఢిల్లీ కోర్టులో విచిత్ర పరిస్థితి:

ఈ నిర్ణయానికి ముందు, ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ వర్మకు ఏ ముఖ్యమైన కేసులు కేటాయించకుండా ఉండడం విశేషం. న్యాయవర్గంలో ఈ వ్యవహారాన్ని “సైలెన్స్ ట్రీట్మెంట్”గా విశ్లేషిస్తారు. ఈ పరోక్ష ఒత్తిడి వల్లే కొలీజియం ఆయనను బదిలీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

అలహాబాద్ కోర్టు బార్ తీవ్ర నిరసన:

అయితే ఆయనను బదిలీ చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ స్పందిస్తూ.. “అవినీతి మచ్చలు ఉన్న జడ్జిని మాకు ఎందుకు పంపుతున్నారు? ఇది మా న్యాయవ్యవస్థపై అవమానం! సుప్రీం కోర్టు ఆయన తీర్పులన్నీ కూడా సమీక్షించాలి. సిబిఐ, ఈడీ సంస్థల చేత దర్యాప్తు చేయించాలి” అని తీవ్ర ప్రతిఘటన వ్యక్తం చేశారు.

 

న్యాయమూర్తి ఇంట్లో భారీగా నగదు లభ్యం..

ఇటీవల హోలీ పండుగ సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో సంభవించిన అగ్నిప్రమాద సమయంలో దాదాపు ₹15 కోట్ల మేర నోట్ల కట్టలు లభించాయి. బయటపడ్డాయి. ఆ సమయంలో ఆయన పండుగ కోసం తన కుటుంబసమేతంగా తన స్వస్థలం వెళ్లారు. ఈ సంఘటనతో న్యాయమూర్తి సంపాదనకు మించిన ఆదాయం ఎలా వచ్చింది? ఈ నిధులు అవినీతి ద్వారా వచ్చినవేనా? అన్న ప్రశ్నలు తలెత్తాయి.

 

గతంలో అలహాబాద్ హై కోర్టు నుంచి ఢిల్లీ హై కోర్టుకు బదిలీ

2021లో అలహాబాద్ నుండి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయిన యశ్వంత్ వర్మ, ఇప్పుడు తిరిగి అలహాబాద్ హై కోర్టుకే పంపబడుతున్నారు. ఈ బదిలీకి.. ఆరోపణలకు సంబంధం లేదని సుప్రీం కోర్టు పేర్కొన్నా, న్యాయవర్గం ఇది సమస్యకు “పరిష్కారం” కాదని భావిస్తోంది.

 

సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

సుప్రీం కోర్టులో యశ్వంత్ వర్మ ఆస్తులపై స్వతంత్ర దర్యాప్తు కోసం PIL దాఖలు చేయబడింది. జడ్జి ఇంట్లో భారీగా నగదు లభించడంతో ఈ ఘటనపై దర్యప్తునకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పలువురు న్యాయవాదులు అత్యున్నత కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం డిమాండ్లు కూడా చేశారు.

 

ఈ వివాదం ప్రస్తుతం న్యాయవ్యవస్థలోని అంతర్గత సవాళ్లను బహిర్గతం చేసింది. ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం కాపాడుకోవడమే ఇప్పుడు సుప్రీం కోర్టు కొలీజియంకు ప్రధాన సవాలుగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *