ఏపీలో రాజధాని అమరావతితో పాటు ఆర్ధిక రాజధాని వైజాగ్, ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో నిన్న సమావేశమైన కేబినెట్ వైజాగ్ కు శుభవార్త చెప్పగా.. ఇదే సమావేశంలో సీఎం చంద్రబాబు అమరావతి, తిరుపతికి దీన్ని వర్తింపచేస్తామని వెల్లడించారు. దీంతో ఈ మూడు నగరాల్లో ప్రజలకు త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వైజాగ్ లో లులూ మాల్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ మాల్ ఏర్పాటు అయ్యేలోగా ప్రభుత్వం మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడంతో లులూ మాల్ అక్కడ ఏర్పాటు కాలేదు. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి వైజాగ్ లో లులూ మాల్ ఏర్పాటుకు వారిని ఒప్పించింది. దీనికి నిన్న కేబినెట్ అనుమతి కూడా ఇచ్చింది. దీంతో త్వరలో వైజాగ్ లో ఈ మాల్ ఏర్పాటు కాబోతోంది.
అయితే వైజాగ్ తో పాటు తిరుపతి, అమరావతిలోనూ లులూ మాల్స్ ఏర్పాటుకు సంస్థ ఆసక్తిగా ఉందని సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలోనే మంత్రులకు చెప్పారు. దీంతో ఈ రెండు నగరాల్లోనూ లులూ మాల్స్ ఏర్పాటు దిశగా అడుగులు పడబోతున్నాయి. ముందు వైజాగ్ లో ఈ మాల్ ఏర్పాటు చేశాక తిరుపతిలో రెండో మాల్, అమరావతిలో మూడో మాల్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
గతంలో వైజాగ్ లో వైసీపీ ప్రభుత్వం తమకు కేటాయించిన భూముల్ని వెనక్కి తీసేసుకోవడంతో వెళ్లిపోయిన లులూ మాల్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసి భారీ సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో ఏపీలో వీటి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి.