తెలంగాణలో ఉపఎన్నికలు.. కాంగ్రెస్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ..

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటకట్టుకుందన్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్‌లో బుధవారం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు.

 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కేసీఆర్. ప్రజల కోసం పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తెలంగాణ అస్థిత్వ పార్టీ అని.. తెలంగాణ కోసం బీఆర్ఎస్ మాత్రమే పోరాడగలదని అన్నారు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలుసన్నారు. వందశాతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు కేసీఆర్.

 

పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏడాది పొడవునా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల కోసం సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ తెలిపారు.

 

ఏప్రిల్ 10 నుంచి 27 వరకు సభ్యత్వ నమోదు, ఆ తర్వాత సంస్థాగత కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అక్టోబర్, నవంబర్‌లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు కేసీఆర్. స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

 

ఈ నేపథ్యంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ఓటమికే కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన పార్టీ అని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయమని కేసీఆర్ అన్నారు. ఆ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఇక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్ లేదని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *