గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారు అయిన దళితుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్టు చేసి రిమాండ్ పై జైలుకు పంపారు. అయితే ఈ కేసులో తన ప్రమేయం లేదని చెబుతున్న వంశీ తాజాగా విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్ధానంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది.
ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ ఇప్పటివరకూ బెయిల్ కోసం అప్పీలు చేసుకోలేదు. మరోవైపు జైల్లో తనకు అదనపు వసతులు కావాలని కోరుతూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జైల్లో తనకు వీఐపీ ఖైదీగా పరిగణించాలంటూ వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణకు సిద్దమైన కోర్టు.. అంతకు ముందే పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
వల్లభనేని వంశీకి జైల్లో ఎలాంటి సదుపాయాలు కావాలో రాతపూర్వకంగా తెలుసుకోవాలని పోలీసుల్ని విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఆదేశించింది. జైల్లో వసతులపై వల్లభనేని వంశీ పిటిషన్ పై ప్రాథమిక విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
సబ్ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లేఖ తీసుకోవాలని తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ వివరాలను ఇవాళ పోలీసులు కోర్టు ముందు ఉంచబోతున్నారు. వీటి ఆధారంగా కోర్టు వంశీకి అదనపు సదుపాయాలు కల్పించాలా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది.