రైతుభరోసా అమలు ముహూర్తం – సచివాలయాల్లో మార్పులు..

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాల అమలుకు సిద్దం అవుతోంది. ఈ మేరకు మంత్రివర్గ భేటీలో పలు అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన వేళ ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టబడులతో పాటుగా సంక్షేమ పథకాల పైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో సచివాలయాల క్రమబద్దీకరణ .. రైతుభరోసా అమలు ముహూర్తంతో పాటుగా అన్నా క్యాంటీన్లు, కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల పైనా నిర్ణయం తీసుకోనున్నారు. తిరుపతి తొక్కిసలాట అంశం చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.

 

సచివాలయాల క్రమబద్దీకరణ

ఈ రోజు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రం లో పెట్టబడులు.. భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. సచివాలయాల క్రమబద్దీకరణ పైన ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసారు. జనాభా ప్రాతిపదికన సచివాలయాల కొనసాగింపు.. సిబ్బంది సర్దుబాటు పైన నివేదిక ఆధారంగా చర్చించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో పని చేస్తున్న 1.27 లక్షల మంది ఉద్యోగుల క్రమబద్దీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. వాలంటీర్ల అంశం పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవటంతో.. సచివాలయాల అంశం చర్చ సమయంలో ఈ ప్రస్తావన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రైతు భరోసా పై నిర్ణయం

ఇక, సంక్షేమ పథకాల అమలు పైన గత సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో కేంద్రం పీఎం కిసాన్ నిధుల విడుదలకు నిర్ణయించింది. ఈ సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆర్దిక వెసులుబాటు పరిగణలోకి తీసుకొని నేటి కేబినెట్ సమావేశంలో ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధుల జమ పైన ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఇప్పటికే అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్లను ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయానికి నేటి కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉగాది నుంచి ప్రారంభించాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వం నేడు తుది నిర్ణయం తీసుకోనుంది.

 

ముఖ్యమంత్రి దిశా నిర్దేశం

అదే విధంగా.. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన పైన మంత్రివర్గంలో సమీక్ష చేసే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటుగా ముఖ్యమంత్రి దావోస్ పర్యటన వేళ అక్కడ ఇప్పటికే ఖరారైన భేటీ లు.. కలిసే ప్రముఖుల గురించి వివరించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడు నెలలు పూర్తి కావటంతో మంత్రుల పనితీరు గురించి ముఖ్యమంత్రి నివేదికలు సిద్దం చేసారు. అదే విధం గా అధికారిక అజెండా పూర్తయిన తరువాత రాజకీయ అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా మూడు పార్టీల మధ్య సమన్వయం.. కలిసి కట్టుగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశం పైన ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *