ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి తన సొంత నియోజక వర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ‘స్వర్ణ కుప్పం’ విజన్-2029′ డాక్యుమెంట్‌ను చంద్రబాబు విడుదల చేయనున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నా రు. పీఎం సూర్యఘర్ పథకం పైలెట్ ప్రాజెక్టు కుప్పంలో అమలు చేయనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో చంద్రబాబు కుప్పంకు కొత్త వరాలు ప్రకటించే అవకాశం ఉంది.
విజన్ ఆవిష్కరణ
కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటున్నారు. సోమవారం ఉదయం 11.50 గంటలకు ద్రావిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారుల స్వాగతం అనంతరం మధ్యాహ్నం12.00 గంటలకు ద్రావిడ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకుని స్వర్ణ కుప్పం విజన్ 2029ను ఆవిష్కరిస్తారు. 2.25 గంటలకు కుప్పం మండలం నడిమూరు గ్రామం చేరుకుని సోలరైజేషన్‌ను ప్రారంభించి లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు సీగలపల్లి గ్రామం చేరుకుని ప్రకృతి వ్యవసాయ రైతులతో ముచ్చటిస్తారు.
పైలెట్ ప్రాజెక్టుగా
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికీ సౌర పలకాలు అమర్చాలని నిర్ణయించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద కుప్పంలోని ప్రజలకు వంద శాతం రాయితీతో ప్రతి ఇంటికీ సౌర విద్యుత్తును అందించే పథకాన్ని ప్రారంభించనున్నారు. తాజాగా కుప్పం మండలం నడిమూరులో ఇళ్లపై సౌర పలకలు అమర్చడంతో వాటి వెలుగులు గ్రామంలో ప్రసరిస్తున్నాయి. నియోజకవర్గంలో ఉన్న అన్ని ఇళ్లకూ సౌర పరికరాలు అమర్చాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రకృతి వ్యవసాయం విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తారు.
షెడ్యూల్ ఇలా
మంగళవారం ఉదయం 10. గంటలకు సీఎం చంద్రబాబు కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహం నుండి బయలుదేరి కుప్పం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చేరుకుంటారు. స్థానికుల నుంచి వినతులు స్వీకరణ కార్యక్రమం చేపడతారు. మధ్యాహ్నం12.20 గంటలకు కంగుంది గ్రామం చేరుకుని కీర్తిశేషులు శ్యామన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.20 గంటలకు కుప్పంలో ని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వెళతారు. తర్వాత మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ద్రవిడ యూనివర్సిటీలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాత్రికి అక్కడే బస చేస్తారు. 8వ తేదీ (బుధవారం) ఉదయం 8 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి విశాఖకు వెళతారు.