దేశ వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది . అదుపు చేయరని స్థితి లోకి చేరుకుంటింది . ఈ సమయంలో రెక్కాడితేగానీ డొక్కాడని పేద గిరిజనులకు లాక్‌డౌన్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వ సాయం కొండంత అండగా నిలిచింది. లాక్‌డౌన్ కారణంగా ముఖ్యంగా మారుమూల కొండరెడ్డి గిరిజనుల ఉపాధి కష్టతరంగా మారే పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రకటించిన సాయం వారికి వరంలా మారింది. ఫలితంగా అడవి బిడ్డలు రెండుపూటలా పట్టెడన్నం తింటున్నారు. కరోనాపై సరైన అవగాహన లేకున్నా గిరిపల్లెలు లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నాయి. ఎవరూ గడప దాటి బయటకు రావడం లేదు. తమ గ్రామాల్లోకీ ఎవరినీ రానివ్వడం లేదు. గ్రామ పొలిమేరల్లో గిరిజనులు వెదురు తడికలతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రోజుకు నలుగురు చొప్పున కాపలా ఉంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అందించిన బియ్యం, కందిపప్పు, రూ.1,000 పేదలకు వరంలా మారింది. గ్రామ వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు వల్ల మారుమూల దట్టమైన కొండకోనల్లో బాహ్య ప్రపంచానికి దూరంగా నివసిస్తున్న గిరిజనులకు సైతం సకాలంలో సాయం అందింది. దీంతో కష్టకాలంలో ప్రభుత్వం అందించిన సహాయం మర్చిపోలేనిదని గిరిజనులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గిరిజన ప్రాంతమైన పోలవరం నియోజకవర్గంలో 1,00,377 మంది తెల్ల రేషన్‌కార్డుదారులకు సుమారు 5,400 టన్నుల 875 కేజీల బియ్యం, 57,058 కేజీల కందిపప్పు పంపిణీ అయింది. వీటితోపాటు రూ. 1000 చొప్పున సుమారు రూ. 10,03,77,000 సొమ్ము నేరుగా లబి్ధదారులకు చేరింది. మారుమూల కుగ్రామాలకు సైతం ఒక్క రోజులోనే సాయం అందిందని, ఇది ఒక చరిత్ర అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా గిరిజనులకు అండగా నిలుస్తున్నాయి.