విజయవాడ: ఆస్తిపన్ను, డ్రైనేజీ, చెత్తపన్ను పెంపును నిరసిస్తూ టీడీపీ కార్పొరేటర్లు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాల మాట్లాడుతూ…పెంచిన ఆస్తిపన్ను , ఇంటిపన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పన్నులు పెంచబోమని చెప్పారని..గెలిచిన తర్వాత ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై ఐదు వందల కోట్ల భారం పడుతోందని తెలిపారు. పన్నులను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బాల తెలిపారు.
టీడీపీ కార్పోరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ… ప్రభుత్వం పన్నుల నోటిఫికేషన్ రద్దు చేయాలన్నారు. దొడ్డిదారిన జీవోలు తీసుకువచ్చారని విమర్శించారు. పన్నులు పెంచుతారని తాము ఎన్నికల ముందే చెప్పామని…జీవోలు రద్దు చేసే వరకు టీడీపీ తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వెంటనే అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పన్నులపై అవసరం అయితే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు.
