జార్ఖండ్ లో గెలుపెవరిది..? ఫలితాల పై ఉత్కంఠ..?

జార్ఖండ్ లో తొలి విడత పోలింగ్ ముగిసింది. 64.86 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 43 స్థానాలకు జరిగిన పోలింగ్ సరళి పైన పార్టీలు అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో పోలింగ్ శాతం పెరటంతో జేఎంఎం కూటమిలో ఆశలు పెరుగుతున్నాయి. అయితే, బీజేపీ కూటమి సైతం పోలింగ్ జరిగిన తీరును అధినాయకత్వానికి నివేదించింది. దీంతో, రెండో విడత పోలింగ్ కోసం రెండు కూటములు సిద్దం అవుతున్నాయి. తుది ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.

 

సరళి -అంచనాలు

జార్ఖండ్ లో తొలి విడత పోలింగ్ సరళి ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయానికి ముందే రెండు కూటముల నేతలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. జేఎంఎం కూటమిని అధికారానికి దూరం చేయాలనేది బీజేపీ ముఖ్య నేతల ఆలోచన. రెండు కూటములు హోరా హోరీ ప్రచారంతో పాటుగా స్థానికంగా గిరిజనులను ఆకట్టుకునే హామీలు గుప్పించారు. బీజేపీ ప్రత్యేకంగా చొరబాట్ల అంశాన్ని ప్రచార అస్త్రంగా మలచుకుంది. జార్ఖండ్ భవిష్యత్ తమతోనే సాధ్యమని ముఖ్య నేతలు ప్రచారం చేసారు.

 

పార్టీల ధీమా

ఇటు జేఎంఎం గిరిజన ప్రాంతాల్లో తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకుంటూనే.. మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. తొలి విడత పోలింగ్ లో జేఎంఎంకు పట్టు ఉన్న ప్రాంతాల్లో ఎక్కవ పోలింగ్ జరగటంతో బీజేపీ నేతలు లెక్కలు తీస్తున్నారు. జేఎంఎం కూటమి తమకు పూర్తి పట్టు చిక్కిందని చెబుతుండగా.. అధికార మార్పు ఖాయమనే సంకేతాలు తొలి విడత పోలింగ్ లో స్పష్టం అయిందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, పోలింగ్ శాతం సైతం రెండు కూటముల్లోనూ పైకి ధీమాగా కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం టెన్షన్ పెంచుతోంది. ఈ క్రమంలో ఈ నెల 20న జరిగే రెండో విడత పోలింగ్ కు పార్టీలు సిద్దం అవుతున్నాయి.

 

రెండో విడత కోసం

81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో రెండో విడతలో మొత్తం 38 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 23న చేపట్టనున్నారు. గత ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌, ఆర్జేడీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 25సీట్లు వచ్చాయి. తొలి విడతలో ఓటర్ల సరళి స్పష్టం కావటంతో ఈ నెల 18వ తేదీ వరకు ఉన్న ప్రచార సమయం సద్వినియోగం చేసుకొని ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు పార్టీలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత ఓటర్ల మద్దతు కోసం జేఎంఎం కూటమి నేతలు ఫోకస చేసారు. బీజేపీ కూటమి పూర్తిగా ప్రజలు తమ వైపు ఉన్నారనే ధీమాతో రెండో విడత ఎన్నికలకు సిద్దం అవుతోంది. దీంతో, అంతిమంగా జార్ఖండ్ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *