జమిలి వేళ చంద్రబాబు కీలక నిర్ణయం..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కేంద్రంలో జమిలి ఎన్నికల దిశగా కసరత్తు వేగవంతం అవుతోంది. ఇదే సమయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. 2027లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, ఎన్నికల హామీల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో జిల్లాల వారీగానూ కొత్త ప్రణాళికలతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. ఈ దశలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

కీలక సదస్సు

ముఖ్యమంత్రి చంద్రబాబు జమిలి ప్రచారం వేళ అలర్ట్ అయ్యారు. సంక్షేమ పథకాలను వీలైనంత త్వరగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇక.. పాలనా పరంగానూ నిర్ణయాలను వేగవంతం చేయాలని డిసైడ్ అయ్యారు. జిల్లాల వారీగా విజన్ ఆవిష్కరించి.. అమలు దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. దీని ద్వారా ప్రతీ జిల్లాలో పార్టీ – పాలనా పరంగా పట్టు పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందు కోసం ముందుగా తన ఆలోచనలను వివరించి.. జిల్లా స్థాయిలో పాలనా పరంగా నిర్ణయాల అమలు కోసం జిల్లా కలెక్టర్ల సమావేశానికి చంద్రబాబు నిర్ణయించారు. ఈ సమావేశాల ద్వారా అధికార యంత్రాంగానికి రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నారు.

 

దిశా నిర్దేశం

ఈ నెల 24,25 తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇది రెండో సదస్సు. తొలి సారి సమావేశంలో పలు లక్ష్యాలను కలెక్టర్లకు నిర్దేశించారు. వాటి పురోగతిని పరిశీలించటంతో పాటుగా ప్రభుత్వ ప్రాధాన్యతలను చంద్రబాబు కలెక్టర్లకు వివరించనున్నారు. నాలుగు నెలల పాలనలో శాఖల వారీగా సాధించిన పురోగతి.. భవిష్యత్ లక్ష్యాల పైన కసరత్తు చేస్తున్నారు. వీటిని కలెక్టర్ల సమావేశంలో నిర్దేశించనున్నారు. జిల్లాల వారీగా కలెక్టర్లకు లక్ష్యాలను ప్రభుత్వం స్పష్టం చేయనుంది. జిల్లాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు.. అమలు.. ప్రాధాన్యతలను కలెక్టర్లకు ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం మార్గనిర్దేశనం చేస్తుందని తెలుస్తోంది.

 

శాంతి భద్రతలపై

అదే విధంగా కలెక్టర్లతో పాటుగా ఎస్పీలతోనూ జిల్లాల వారీగా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. కొద్ది కాలంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైనా చర్చించనున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం స్పష్టం చేసారు. మహిళా భద్రత గురించి ఈ కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావన చేయనున్నారు. అదే విధంగా పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఈ సారి రాజకీయ పరిపాలన ఉంటుందని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేయటంతో ఈ రెండు రోజుల సదస్సు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్దంగా ఉండే విధంగా పాలనా పరంగా నిర్ణయాలకు వేదికగా నిలవనుందని కూటమి నేతలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *