జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుప్వారా, రాజౌరీ జిల్లాల్లో రెండు చోట్ల భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఉగ్రవాద కదలికలు ఉన్నాయన్న సమాచారంలో భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. తొలుత భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కొంతసేపటికి వరకు ఎదురుకాల్పులు కొనసాగాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది.
కుప్వార్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. తంగ్ధర్ ప్రాంతంలో ఒక ఉగ్రవాది, మచిల్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చారు.
బుధవారం అర్ధరాత్రి తర్వాత తంగ్ధర్ సెక్టార్లో ఉగ్రవాదులు కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమై భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. అదే విధంగా 57 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు అప్రమత్తమయ్యాయి. మచిల్ సెక్టార్లోనే ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించి ఆ ప్రాంతంలో మరో ఆపరేషన్ ప్రారంభించింది.