రెడ్ బుక్ లో ఉన్నవారంతా వాళ్లే.. :మంత్రి లోకేష్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. ప్రతిపక్ష వైసీపీ నేతలు రెడ్ బుక్ పై ఆరోపణలు చేస్తున్నారు. రెడ్ బుక్ పేరు చెప్పి.. తమపార్టీ వాళ్లను భయపెడుతున్నారని ఆరోపించిన సందర్భాలున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేశ్ ఈ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. తాజాగా ఈ రెడ్ బుక్ పై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

మంగళగిరి నరసింహస్వామి ఆలయానికి నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్ బుక్ లో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లందరి పేర్లు ఉన్నాయని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారందరిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులపై.. నివేదిక వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

ఇటీవలే మాజీ సీఎం జగన్ కూడా రెడ్ బుక్ పై వ్యాఖ్యలు చేశారు. ఎవరిని తొక్కేయాలి.. ఎవరిపై కేసులు పెట్టాలి.. ఎవరి ఆస్తుల్ని ధ్వంసం చేయాలన్న విషయాలనే అందులో రాసుకున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. రెడ్ బుక్ ను ఎవరు పడితే వాళ్లు తెరవడం, దానిపేరుతో విధ్వంసాలు చేయడం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. అధికారపార్టీ వాళ్లే అరాచకాలు చేసి.. వాటిని తమ నేతలపై రుద్దుతున్నారని వాపోయారు.

 

రెడ్ బుక్ పేరు చెప్పి.. అధికారులను, నేతలను అధికారపార్టీ భయపెడుతోందని వాపోతున్న వైసీపీ నేతలు.. తాజాగా మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *