UPI పేమెంట్స్ తరహాలో ULI..

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్.. క్లుప్తంగా యూపీఐ. దీని గురించి తెలియని వాళ్లు ఉండరు. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో ఇదొక సంచలనం. పేటీఎం, ఫోన్ పే వంటి యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్ జరిపే ప్రతి ఒక్కరికీ ఇది సుపరిచితమే. గ్రామీణ స్థాయిలోనూ డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టిందీ యూపీఐ.

 

అదే తరహాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తీసుకుని రానుంది. మరింత సులభంగా రుణాలను పొందడానికి యూఎల్ఐని తెర మీదికి తీసుకుని రాబోతోంది. ఈ ప్లాట్‌ఫామ్ కూడా మరో సంచలనాలకు తెర తీస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

 

దేశంలో రుణాల మంజూరు వ్యవస్థను మరింత వేగవంతం చేయడం దీని ఉద్దేశం. లెండింగ్ సెగ్మెంట్‌ను ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయగలదని భావిస్తున్నారు. రుణాలు పొందడంలో ఇబ్బందులను తొలగించేలా యూఎల్ఐని రూపొందించినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

 

బెంగళూరులో ఏర్పాటైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో శక్తికాంత దాస్ మాట్లాడారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా యూఎల్ఐని ప్రారంభించినట్లు వివరించారు. ఇందులో ఎదురయ్యే సాంకేతికపరమైన ఇబ్బందులను గుర్తించి.. పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా యూఎల్ఐని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.

 

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను రూపురేఖలను యూపీఐ మార్చినట్లే దేశంలో రుణాలు ఇచ్చే విధానాన్ని కూడా యూఎల్ఐ మార్చివేస్తరందని ఆశిస్తున్నామని అన్నారు. గ్రామీణ రుణ గ్రహీతలకు ఇది మరింత ఉపయోగపడుతుందని, వారి అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు చెప్పారు.

 

జన్‌ధన్ యోజన-ఆధార్-మొబైల్ నంబర్, యూపీఐ తరువాత దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగంగా పరుగులు పెట్టించేలా, రుణాల జారీని మరింత వేగవంతం చేసేలా యూఎల్ఐ కూడా ఓ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. జామ్-యూపీఐ-యూఎల్ఐలను త్రిమూర్తులుగా అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *