హైదరాబాద్ పాతబస్తీలో అమ్మవారి ఆలయం ధ్వంసం..

హైదరాబాద్ పాతబస్తీలో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు భూలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేయడం, విగ్రహాలను పగులగొట్టడం దీనికి కారణమైంది. పోలీసులు సకాలంలో స్పందించారు. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడం విజయం సాధించారు.

 

పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల రక్షాపుంలో ఈ ఘటన సంభవించింది. ఇక్కడున్న శ్రీభూలక్ష్మీ ఆలయంలో గల అమ్మవారి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. వాటిని మొత్తం ధ్వంసం చేశారు.

 

అక్కడి పూజా సామాగ్రి, పీట, ఇతర వస్తువులను చిందర వందర చేశారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమ్మవారి విగ్రహంపైన ఉండే కిరీటం కిందపడి ఉండటం, అక్కడే రాళ్లు పడి ఉండటం ఈ వీడియోల్లో స్పష్టంగా రికార్డయింది.

 

ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు స్థానికులు ఆలయం వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించారు. నిరసనలకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆలయం లోనికి వెళ్లి అమ్మవారి విగ్రహం, చిందరవందరగా పడివున్న వస్తువులు, పూజా సామాగ్రిని పరిశీలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

సమాచారం అందిన వెంటనే సౌత్ ఈస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కాంతిలాల్ పాటిల్, ఇతర అధికారులు, చంద్రాయణగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. అదే సమయంలో అఖిల భారత మజ్లిస్-ఇ-ముస్లిమీన్‌కు స్థానిక కార్పొరేటర్లు అక్కడికి వచ్చారు.

ఎంఐఎం కార్పొరేటర్లతో కలిసి పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడారు. వారికి నచ్చజెప్పారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. విగ్రహాలను ధ్వంసం చేసిన యువకుడిని సైతం గుర్తించారు. నిందితుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడంటూ అతని తల్లి వివరించారు. అతను ఏం చేస్తాడో అతనికే తెలియదని, మానసిక చికిత్స ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *