J6@Times//హైదరాబాద్: తెలంగాణలో త్వరలో మరోసారి కరెంట్ చార్జీల షాక్ తగలబోతోంది. డిస్కమ్‌లు వ్యయం లోటును భర్తీ చేసుకునేందుకు కొత్త దారులు వెతుకుతున్నాయి. కొన్నిసార్లు ఎక్కువ ధరపెట్టి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందని అప్పుడు వినియోగదారుల నుంచి వసూలు చేసే ధరకు, కొనుగోలు ధరకు వ్యత్యాసం ఉంటుందని అంటున్నాయి. ఇటువంటి విద్యుత్ వ్యయ సర్దుబాటును కొన్ని రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు వినియోగదారుల నుంచే వసూలు చేస్తున్నారు. అదికూడా ప్రతిసారి ఈఆర్‌సీ నుంచి అనుమతి తీసుకోకుండానే వసూలు చేసుకుంటున్నారు. ఇలా వ్యయ సర్దుబాటును నెలవారీగా వినియోగదారుల నుంచి వసూలు చేసుకునే అవకాశాన్ని తమకు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని డిస్కమ్‌లు కోరాయి. వినియోగం ఆధారంగా సెక్యూరిటీ డిపాజిట్లను భారీగా పెంచుకోడానికి కూడా ప్రతిపాదనలు సమర్పించాయి. తద్వరా కొండలా పెరుగుతున్న తమ ఆర్థిక లోటును పూడ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
