వైసీపీ అధినేత జగన్‌కు కష్టాలు రెట్టింపయ్యాయా..? పదే పదే జగన్ బెంగుళూరు వెళ్లడం వెనుక అసలేం జరుగుతోంది..?

వైసీపీ అధినేత జగన్‌కు కష్టాలు రెట్టింపయ్యాయా? పదే పదే జగన్ బెంగుళూరు వెళ్లడం వెనుక అసలేం జరుగుతోంది? ఏపీ బేవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యారా? ఈ కేసు అధినేత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? ఏపీలో వైసీపీ పనైపోయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ గగ్గోలు పెట్టింది. ఇందులో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనే బలంగా చెబుతోంది. ఏపీలో అధికార మారగానే బేవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి తట్టా బుట్టా (హార్డ్ డిస్క్‌లు, ఫైల్స్) సర్దుకుని ఏపీ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. కీలకపత్రాలను స్వాధీనం చేసుకుంది. వాసుదేవరెడ్డి ఆచూకీపై సీఐడీ కన్నేసింది.

 

వైసీపీ అధినేత జగన్ చీటికీ మాటికీ బెంగుళూరు వెళ్లడం, వాసుదేవరెడ్డి ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా సీఐడీ అధికారులు దృష్టి సారించారు. బెంగుళూరులో జగన్ యలహంక ప్యాలెస్‌కు సమీపంలోని ఓ హోటల్‌లో వాసుదేవరెడ్డి మకాం పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వాసుదేవరెడ్డి ఆచూకీ గురించి తెలియడంతో బెంగుళూరు వెళ్లారు సీఐడీ అధికారులు.

 

లాయర్లతో కలిసి మాజీ ఎండీ వాసుదేవరెడ్డి హోటల్‌కి వెళ్లడాన్ని సీఐడీ అధికారులు గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అరెస్టు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట. విచారణలో ఆయన కీలక విషయాలు బయటపెట్టినట్టు వార్తలు జోరందుకున్నాయి.

 

మద్యం పాలసీ నిర్ణయాలు.. విక్రయాలు, ముడుపులు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు, పర్సెంటేజీలు వ్యవహారంపై విషయాలు బయటపెట్టినట్టు సమాచారం. వాసుదేవరెడ్డి బయటపెట్టిన వివరాలతో మరికొంత మందిని విచారించాలని అధికారులు భావిస్తున్నారు. పనిలోపనిగా డిస్టలరీ యజమానులను సైతం విచారించాలని ఆలోచన చేస్తోందట సీఐడీ.

 

ఈ వ్యవహారంతో జగన్‌కు లింకులుంటే ఇరుక్కోవడం ఖాయమన్నది టీడీపీ నేతల మాట. కోట్ల రూపాయలు మారినట్టు తెలుస్తోంది. వీలైతే ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఏపీలో వైసీపీ పనైపోయినట్టేనని అంటున్నారు. ఈ క్రమంలో పార్టీలో మార్పులు చేయాలని జగన్ భావిస్తున్నట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *