గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసులో సుప్రీం స్టే..!

ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్‌ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌ కుమార్, కుర్రా సత్యనారాయణ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వీరి పిటిషన్లను నేడు కోర్టు బుధవారం విచారించింది. ఈ కేసులో గవర్నర్, ప్రభుత్వం నిర్ణయాలను గౌరవించాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

 

ఇదీ కేసు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. కాగా, విద్య, సామాజిక సేవ, కళలు తదితర రంగాలకు చెందిన వారిని మాత్రమే గవర్నర్ కోటాలో ప్రతిపాదించాలనే నిబంధనలు చూపుతూ, నాటి గవర్నర్ తమిళి సై.. ఆ ఫైలును ప్రభుత్వానికి తిప్పిపంపారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌‌లకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు చేయగా, రాజ్ భవన్ వారి పేర్లను ఆమోదించటంతో ప్రభుత్వం గెటిట్‌ను ప్రకటించింది. కాగా, ఈ విషయంలో గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారంటూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించగా, విడుదలైన ఎమ్మెల్సీ నియామక గెజిట్‌ను హైకోర్టు కొట్టివేయటమే గాక కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకంపై స్టే విధించింది. ఈ విషయంలో హైకోర్టు విధించిన స్టే మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో నేడు సర్వోన్నత న్యాయస్థానంలో దీనిపై విచారణ జరిగింది.

 

సారీ.. అలా కుదరదు..

ఎమ్మెల్సీల నియామకంపై దాఖలైన పిటీషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పిబి వరాలేలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టేటస్ కో విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అభ్యర్దించారు. కాగా, కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకోవటం కుదరదని, అలా చేయటమంటే.. గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు హరించటమేనని వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన ధర్మాసనం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *